కూలి పని పేరుతో వల.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దోపిడీ
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
కూలి పని పేరుతో వల.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దోపిడీ
-
ఇద్దరు పాత నేరస్థుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
-
నగదు, మొబైల్ ఫోన్లు, ఆటో స్వాధీనం
-
వివరాలు వెల్లడించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :కామారెడ్డి
కూలి పనికి వస్తానని నమ్మించి ఓ మేస్త్రీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, బెదిరించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను కామారెడ్డి పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. కామారెడ్డి పట్టణానికి చెందిన మేస్త్రీ నీరడి భూమేష్ (40) ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో కూలీల కోసం స్థానిక జేపీఎన్ చౌక్ వద్దకు వెళ్లాడు. అక్కడ బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన కడమంచి లక్ష్మి అలియాస్ హైమద్ బీ (35) అతడికి పరిచయమైంది. మరుసటి రోజు నుంచి తాను కూలి పనికి వస్తానని నమ్మబలికిన ఆమె, ఉగ్రవాయి మైసమ్మ ఆలయానికి వెళ్దామని చెప్పి భూమేష్ బైక్‌పై అక్కడికి వెళ్లింది. ఆలయ పరిసరాల్లో వారిద్దరూ భోజనం చేస్తుండగా, ముందస్తు పథకం ప్రకారం ఆర్.బీ. నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ అల్లం శివకుమార్ (25) ఆటోలో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం నిందితులిద్దరూ కలిసి భూమేష్‌ను చంపేస్తామని బెదిరించి, అతని వద్ద ఉన్న రూ.900 నగదు, రెడ్మీ 9 మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు అదే రోజు రాత్రి కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కా నిఘాతో నిందితుల పట్టివేత.. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో, టౌన్ ఎస్హెచ్ఓ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, ఈ నెల 11న జేపీఎన్ విగ్రహం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న లక్ష్మి, శివకుమార్లను గుర్తించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. నిందితుల నుంచి దోచుకున్న రూ.900 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ఆటో రిక్షాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పాత కేసులు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ముఠాగా ఏర్పడ్డారని ఎస్పీ తెలిపారు. లేబర్ చౌక్, బస్టాండ్, కల్లు దుకాణాల వద్ద అమాయకులను గుర్తించి, లక్ష్మి మాయమాటలతో వారిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లడం.. అక్కడికి శివకుమార్ ఆటోలో వచ్చి ఇద్దరూ కలిసి దోపిడీలకు పాల్పడటం వీరి నేర శైలి అని వివరించారు. నిందితురాలు లక్ష్మిపై గతంలో కామారెడ్డి పీఎస్‌లో రెండు దోపిడీ కేసులు, దేవునిపల్లి, మేడ్చల్ ఠాణాల్లో దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. అలాగే శివకుమార్‌పై కామారెడ్డి పీఎస్‌లో రెండు దొంగతనం కేసులు, రెండు హత్యాయత్నం కేసులు, ఒక దాడి కేసు నమోదై ఉన్నాయని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.