భూముల రీసర్వే పనులను వేగవంతం చేయాలి
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
భూముల రీసర్వే పనులను వేగవంతం చేయాలి
-
రోజువారీ పురోగతిపై నిరంతర పర్యవేక్షణ అవసరం
-
గ్రామసభలు పూర్తయిన వెంటనే సర్వే ప్రారంభించాలి
-
సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో రీసర్వే పురోగతిపై ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ చేపడుతున్న సర్వే పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రోవర్ పరికరాల పనితీరు, వాటి వినియోగంతో పాటు సర్వే బృందాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాలోని 70 కాడాస్ట్రల్ రీసర్వే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన అనంతరం, ఏమాత్రం జాప్యం లేకుండా వెంటనే సర్వే పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 50 సర్వే బృందాల ఏర్పాటు: జిల్లాలో రీసర్వే నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 158 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఉండగా, వారిలో 144 మంది విధులకు తమ సమ్మతిని తెలియజేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం 50 సర్వే బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి ఒక లైసెన్స్డ్ సర్వేయర్‌ను కేటాయించి పనులు వేగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామసభలు పూర్తయిన గ్రామాల వివరాలు, రోజువారీ ప్రగతిని నిరంతరం సమీక్షిస్తూ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, సర్వే మరియు భూ రికార్డుల అధికారి శ్రీనివాస్, ఏవో మసూద్ అహ్మద్, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.