బోర్లం గురుకుల కళాశాలలో ఆకస్మిక తనిఖీ: విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, ఎస్పీ..
బోర్లం గురుకుల కళాశాలలో ఆకస్మిక తనిఖీ: విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, ఎస్పీ..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :బాన్సువాడ..
బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాల (బాలికల)ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు గురుకులంలో అందుతున్న విద్య, వసతులు, భోజనం, మరియు పరిశుభ్రత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా కలెక్టర్, ఎస్పీలు విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థినుల మధ్యలో కూర్చుని వారితో ఆప్యాయంగా మాట్లాడి భోజన నాణ్యత, రుచి, మెనూ సక్రమంగా అందుతుందా లేదా అని స్వయంగా తెలుసుకున్నారు.భోజన తయారీ ప్రదేశం, వంట సామగ్రి, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వంట సిబ్బందిని, అధికారులను ఈ సందర్భంగా వారు అప్రమత్తం చేశారు. తరగతి గదులు, రికార్డుల పరిశీలన.. కళాశాలలోని తరగతి గదులను పరిశీలించిన అధికారులు, విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడి వారి చదువులు, విద్యా ప్రగతి గురించి ఆరా తీశారు. బ్లాక్‌బోర్డుపై పాఠాలు, బోధనా విధానం, కళాశాల రికార్డులు, విద్యార్థులు సాధించిన ట్రోఫీలను పరిశీలించారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి ఉన్నత విద్య దిశగా తగిన మార్గదర్శకత్వం అందించాలని అధ్యాపకులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం.. కళాశాల ఆవరణ, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ మరియు వసతి గృహాలను పరిశీలించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం, పౌష్టికాహారం అందించడం అధికారుల ప్రధాన బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పష్టం చేశారు. విద్యార్థినులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డీసీఓ, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, గిర్దావర్, జీపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.