బాన్సువాడలో గణేష్ ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
బాన్సువాడలో గణేష్ ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:బాన్సువాడ
బాన్సువాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర (ఐపీఎస్) శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ ప్రాంతాల్లోని గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా పట్టణంలోని పలు మండపాలను దర్శించుకున్న ఎస్పీ, ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక బస్సులో శోభాయాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాత బాన్సువాడ చావిడి నుంచి కల్కి చెరువు నిమజ్జన ప్రాంతం వరకు రూట్‌ను పరిశీలించి రోడ్లు, విద్యుత్ వైర్లు, బారికేడింగ్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. కల్కి చెరువు వద్ద రెస్క్యూ బృందాలు, గజఈతగాళ్లు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం బాన్సువాడ రూరల్ పోలీస్ కార్యాలయంలో సబ్ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని, సుప్రీంకోర్టు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. "భక్తి, భద్రత, బాధ్యత" అనే సూత్రంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి, ఆర్డీఓ రవీంద్ర రెడ్డి, మున్సిపల్ చైర్మన్, ఎస్హెచ్ఓ శ్రీధర్, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.