ప్రెస్ రిపోర్టర్ల ముసుగులో బ్లాక్మెయిల్.. ఆత్మహత్య ప్రేరేపణ కేసులో ఇద్దరి అరెస్ట్!
ప్రెస్ రిపోర్టర్ల ముసుగులో బ్లాక్మెయిల్.. ఆత్మహత్య ప్రేరేపణ కేసులో ఇద్దరి అరెస్ట్!
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :కామారెడ్డి క్రైమ్:
ప్రెస్ రిపోర్టర్ల ముసుగులో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కామారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఉద్యోగ వివరాలు సేకరించి, బెదిరింపులకు పాల్పడటం వల్లనే చేపూరి శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ మీడియాకు వెల్లడించారు. కేసు వివరాలు: కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైం నం.693/2024 (చేపూరి శిరీష ఆత్మహత్య కేసు) దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. మృతురాలి ప్రభుత్వ ఉద్యోగం, జీతం, సర్వీస్ వివరాలను RTI ద్వారా సేకరించిన నిందితులు..ఉద్యోగం కోల్పోయేలా చేస్తామని బెదిరించి, పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తూ మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారు. దీంతో ఈ కేసును ఆత్మహత్యకు ప్రేరేపణ కోణంలో మార్చి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న A2 ఇందూరి సిద్దా గౌడ్, A3 లాండే భాస్కర్లను ఆగస్టు 13, 2026 న కామారెడ్డి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని విచారించారు. వారు నేరాన్ని అంగీకరించడంతో నిందితులను కామారెడ్డి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. గతంలోనూ పలు స్టేషన్లలో కేసులు: విచారణలో నిందితుల మోసాలకు సంబంధించిన మరిన్ని అబద్ధపు ప్రచారాలు, వసూళ్ల బండారం బయటపడింది. తాము ప్రెస్ రిపోర్టర్లమని చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యక్తులను బెదిరించడమే వీరి ప్రధాన వృత్తిగా తేలింది. ప్రతికూల వార్తలు ప్రచురిస్తామని, ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తామని భయపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. కాగా, నిందితులపై ఇప్పటికే కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ, గాంధారి, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లలో పలు బెదిరింపులు మరియు వసూళ్ల కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుత కేసులోనూ మృతురాలిపై ఇదే రీతిలో తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆత్మహత్యకు కారకులయ్యారని పోలీసులు స్పష్టం చేశారు.