అమెరికా సామ్రాజ్యవాదాన్ని, యుద్ధోన్మాదాన్ని ఎదిరిద్దాం
అమెరికా సామ్రాజ్యవాదాన్ని, యుద్ధోన్మాదాన్ని ఎదిరిద్దాం
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:నిజామాబాద్
షహీద్ భగత్ సింగ్ 119వ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అందాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పీడీఎస్యూ, పీవైఎల్, పీఓడబ్ల్యు ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. పీఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు బి. నాగమణి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు అమెరికా సామ్రాజ్యవాద విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ బోధన్ డివిజన్ కమిటీ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ.. అమెరికా ఆధిపత్య ధోరణులు, యుద్ధోన్మాదం ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ చూపిన ధైర్యం, త్యాగం, సామాజిక మార్పు కాంక్షను యువత, విద్యార్థులు, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పరిఢవిల్లాలంటే ప్రజల ఐక్య ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి, పీడీఎస్యూ మాజీ నాయకుడు ఉదయ్, పీవైఎల్ నాయకుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.