లింగంపేట్ హత్య కేసు ఛేదన – నిందితుడు అరెస్ట్
లింగంపేట్ హత్య కేసు ఛేదన – నిందితుడు అరెస్ట్
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో సంచలనం సృష్టించిన హత్య కేసను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరితగతిన ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో సహచరుడి చేతిలో మహిళ హత్యకు గురైన ఈ ఘటనపై ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు సోమవారం వివరాలు వెల్లడించారు. ఘటన వివరాలు: లింగంపేట్ మండలం కొరుపోలు గ్రామ శివారులోని నాగారానికి చెందిన చింతకుంట చంద్రవ్వ కుమార్తె గత పదేళ్లుగా అదే గ్రామానికి చెందిన గుట్టమీది సాయిలుతో సహజీవనం చేస్తూ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. హైదరాబాద్లో ఉంటున్న ఆమెను గ్రామానికి రావాలని సాయిలు కొంతకాలంగా బలవంతం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లాలని చెప్పి ఆమెను రప్పించాడు. సెప్టెంబర్ 19న ఉదయం మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లి మాట్లాడించిన నిందితుడు, సాయంత్రం తిరిగి పొలం వద్దకు చేర్చాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన వివాదంతో, తాను ముందే తెచ్చుకున్న ఇనుప రాడ్తో ఆమె తలపై తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు లింగంపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాల గాలింపు: జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడు గుట్టమీది సాయిలును అదుపులోకి తీసుకుని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, ఒక ఒప్పో సెల్ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన సీఐ రాజా రెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.