అంతర్జిల్లా ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
కామారెడ్డి జిల్లాలో అంతర్జిల్లా ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
52 ట్రాన్స్ఫార్మర్లు, ఒక హత్యాయత్నం కేసుల ఛేదన
నిందితుల్లో నలుగురూ సొంత అన్నదమ్ములే..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
కామారెడ్డి, మెదక్ జిల్లాలలో కలకలం సృష్టించిన అంతర్జిల్లా ట్రాన్స్ఫార్మర్ల కాపర్ కాయిల్స్ చోరీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు, ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సొంత అన్నదమ్ముల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో ఈ కేసును విజయవంతంగా ఛేదించారు. నేరాల వివరాలు: గత ఐదు నెలలుగా భిక్నూర్ మండల పరిధిలోని పలు గ్రామాలు మరియు రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 29 ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ కాయిల్స్ చోరీకి గురైనట్లు అసిస్టెంట్ ఇంజనీర్ జాదవ్ బాలాజీ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా, గత నెల సెప్టెంబర్ 9న రమేశ్వరపల్లి గ్రామ శివారులో ట్రాన్స్ఫార్మర్ను దొంగిలిస్తుండగా అడ్డుకున్న అసిస్టెంట్ లైన్మెన్ ప్రభాకర్‌పై నిందితులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇరు కేసులపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ముఠా కామారెడ్డి జిల్లాలో 29, మెదక్ జిల్లాలో 23 చొప్పున మొత్తం 52 ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు, ఒక హత్యాయత్నం, ఒక రాత్రిపూట ఇంటి దొంగతనం కేసులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితులు గతంలోనూ పలు దొంగతనం కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ మరియు స్వాధీనం: శుక్రవారం భిక్నూర్ మండలం పరివార్ హోటల్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 30 కిలోల కాపర్ వైర్, ఒక యమహా ఎఫ్‌జెడ్ బైక్, మొబైల్ ఫోన్ తో పాటు హ్యాక్స సా బ్లేడ్లు, కటింగ్ ప్లేయర్లు, పానలు వంటి చోరీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, భిక్నూర్ సీఐ జె. నరేష్, సీసీఎస్ సీఐ బి. సంతోష్ కుమార్, ఎస్ఐలు అనిల్, మహేష్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.