అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్..
కామారెడ్డి జిల్లాలో అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్.. 4 బైక్లు స్వాధీనం
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి...
కామారెడ్డి జిల్లాలో అంతర్జిల్లా స్థాయిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దొంగిలించిన మూడు మోటార్ సైకిళ్లతో పాటు నేరానికి ఉపయోగించిన మరో బైక్ను, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన వివరాలు: సదాశివనగర్ గ్రామానికి చెందిన హనుమంత్ రాజు తన బజాజ్ పల్సర్ బైక్ను (TS-08-HY-8176) జూలై 24న రాత్రి ఇంటి ముందు పార్క్ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ బి. సంతోష్ కుమార్, ఎస్ఐ పుష్పరాజ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ముఠా మోసం బయటపడిందిలా: సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలపై దృష్టి సారించిన పోలీసులకు శనివారం (ఆగస్టు 08) పద్మాజీవాడి ఎక్స్ రోడ్ బ్రిడ్జి వద్ద నిందితులు పట్టుబడ్డారు. దర్యాప్తులో భాగంగా A1 షేక్ ఇమ్రాన్, A2 అద్నాన్ ఖాన్లు ఒక బైక్పై తిరుగుతూ హోటళ్లు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లలో సులభంగా డబ్బు సంపాదించేందుకు రెక్కీ నిర్వహించి బైక్లను దొంగిలించేవారని తేలింది. ఆ తర్వాత దొంగిలించిన వాహనాలను A4 సయ్యద్ జుబేర్, A5 షేక్ అయాన్, A6 సచిన్ విశ్వనాథ్ ఖండేవాల్లకు తక్కువ ధరకు విక్రయించేవారు. కొనుగోలు చేసిన నిందితులు పోలీసులకు చిక్కకుండా వాటి అసలు నంబర్ ప్లేట్లను తొలగించి నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చి అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న వాహనాలు:
- బజాజ్ పల్సర్ – అసలు నంబర్: MH-26-CT-8348 (నకిలీ నంబర్: TS-18-A-9446)
- బజాజ్ పల్సర్ – అసలు నంబర్: TG-18-B-1382 (నకిలీ నంబర్: TG-16-3642)
- బజాజ్ పల్సర్ – అసలు నంబర్: TS-08-HY-8176 (నకిలీ నంబర్: MH-26-CB-1576)
- టీవీఎస్ రైడర్ – (TG-16-0674 - నేరానికి ఉపయోగించిన వాహనం) ఈ కేసును విజయవంతంగా ఛేదించి, నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎల్లారెడ్డి డీఎస్పీ, సదాశివనగర్ సీఐ బి.సంతోష్ కుమార్, ఎస్ఐ పుష్పరాజ్, మరియు సిబ్బంది ఎండీ అజహర్ ఫరూక్, ఏఆర్పీసీ శంకర్, సీసీఎస్ టీమ్ సభ్యులు రవి, గణపతిలను జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.