కామారెడ్డిలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం.. 96 యూనిట్ల రక్తం సేకరణ
కామారెడ్డిలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం.. 96 యూనిట్ల రక్తం సేకరణ
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :కామారెడ్డి
భారత ప్రధాని నరేంద్ర మోడీ 76వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మరియు ట్రాఫిక్ అవగాహన సదస్సు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని మొత్తం 96 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డి.ఎస్.పి మధుసూదన్, సి.ఐ నరహరిలు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తం అందించి ప్రాణాలు కాపాడే రక్తదాతలే అసలైన ప్రాణదాతలని కొనియాడారు. గత 19 సంవత్సరాలుగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్న కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులను అభినందించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ రక్తదానం చేసిన దాతలకు హెల్మెట్లు అందజేయడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పిలుపునిచ్చారు. ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, కామారెడ్డి రక్తదాతల సమూహం ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ.. 2007లో కేవలం 35 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు 3,500 మందికి పైగా రక్తదాతలతో రాష్ట్రంలోనే అతిపెద్ద సేవా సమూహంగా ఆవిర్భవించిందన్నారు. 19 ఏళ్ల కాలంలో సుమారు 30 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించామని, తలసేమియా బాధిత చిన్నారుల కోసం విశేష సేవలందిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులను సాధించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాతల సహకారంతో 4,000 హెల్మెట్లను అందజేసినట్లు వెల్లడించారు. కార్యక్రమం అనంతరం రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలతో పాటు హెల్మెట్లను బహుకరించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహం సభ్యులు డాక్టర్ బాలు, డాక్టర్ వేద ప్రకాష్, జమీల్ అహ్మద్, పర్ష వెంకటరమణ, ఎర్రం చంద్రశేఖర్, జలిగామ శ్రీకాంత్, కర్షక్ బి.ఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కె. రషీద్, ఆర్కే విద్యా సంస్థల సీఈవో జైపాల్ రెడ్డి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు చిలువేరి మారుతి, దొంతి సుధాకర్, రంగ కిషన్ తదితరులు పాల్గొన్నారు.