నిజామాబాద్ జీజీహెచ్‌ను రిఫరల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ..
నిజామాబాద్ జీజీహెచ్‌ను రిఫరల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:హైదరాబాద్...
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని (GGH) ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే ప్రముఖ రిఫరల్ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఇక్కడ త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాకుండా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనే ఆ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మెడికల్ కాలేజీ, జీజీహెచ్, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల పనితీరు, మౌలిక వసతులు, వైద్య సేవల తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాప్రతినిధులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవ వనరులు, మౌలిక వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు, మందులను సమగ్రంగా బలోపేతం చేస్తున్నాం. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం." — దామోదర్ రాజనర్సింహ, వైద్యారోగ్య శాఖ మంత్రి..
సమావేశంలోని ముఖ్యాంశాలు: కొత్త వైద్యుల నియామకాలు: జిల్లాలోని ఆసుపత్రులలో ఇప్పటికే 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా స్పెషలిస్టులు, 22 మంది పిల్లల వైద్య నిపుణులతో పాటు సుమారు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లను నియమించామని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి జనరల్ మెడిసిన్, సర్జరీ, రేడియాలజీ విభాగాల్లోనూ స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలు పూర్తి కానున్నాయి. స్థానిక వైద్య సదుపాయాల పెంపు: అంకాపూర్‌లో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. నందిపేట్ పీహెచ్‌సీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయడం, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల హర్షం: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, స్థానిక వైద్య సదుపాయాలను మరింత అభివృద్ధి చేస్తే హైదరాబాద్‌లోని ప్రధాన ఆసుపత్రులపై రోగుల ఒత్తిడి తగ్గుతుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి. సుదర్శన్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తో పాటు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.