ప్రభుత్వ ఖజానాకు కన్నం.. అన్నదాతల 'ధాన్యం' మాయం!..
ప్రభుత్వ ఖజానాకు కన్నం.. అన్నదాతల 'ధాన్యం' మాయం!..
నకిలీ ట్రక్ చిట్టీలతో రూ.91 లక్షల ప్రజాధనం స్వాహా!
గోదాం చేరకుండానే 10 లారీల వడ్లు గుట్టుచప్పుడు కాకుండా విక్రయం!
ఐకేపీ, పీఏసీఎస్ కేటుగాళ్లు.. సిరిసిల్ల పోలీసుల చేతికి చిక్కిన ఆరుగురు నిందితులు!
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :రాజన్న సిరిసిల్ల జిల్లా..
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భారీ అక్రమాలకు పాల్పడి, నకిలీ ట్రక్ చిట్టీలను సృష్టించి సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన అంతర్-జిల్లా ముఠాను సిరిసిల్ల పట్టణ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గిత్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కుంభకోణంలో పాల్గొన్న ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. రూ.14.16 లక్షల నగదు స్వాధీనం – రూ.46.21 లక్షల బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్.. నిందితుల నుంచి పోలీసులు రూ.14,16,800 నగదును స్వాధీనం చేసుకున్నారు.అలాగే వారి వివిధ బ్యాంక్ ఖాతాలలో ఉన్న రూ.46,21,358 నిధులను ఫ్రీజ్ చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, నిధుల దుర్వినియోగంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. మోసానికి పాల్పడింది ఇలా... జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్‌కు చెందిన ఉత్క్యం విజయ్ (A1), అతనితో కలిసి పనిచేస్తున్న వేములవాడ రూరల్ అర్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5) ప్రధాన సూత్రధారులుగా మారారు. వీరు ఐకేపీ (IKP) కేంద్రాల నుండి ధాన్యం వచ్చినట్లు అక్రమంగా నకిలీ ట్రక్ చీటీలను తయారు చేశారు. రుద్రంగి ఐకేపీ కేంద్రం లింక్: ఈ మోసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్-చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీల ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీలు జారీ చేయగా, వాటిని ఉత్క్యం విజయ్ సివిల్ సప్లై వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. అనంతరం ఆ నిధులను నిందితులు తమలో తాము పంచుకున్నారు. బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం లింక్: అదేవిధంగా, డి.ఎం.ఓ (DMO) కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ (PACS) కేంద్రం ఇన్-చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీని సృష్టించారు. దానిని ఉత్క్యం విజయ్‌కు అందించగా, అతను సివిల్ సప్లై వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. దీనికి రాజశేఖర్ ఆమోదం తెలిపారు. ఆ తర్వాత విడుదలైన నిధులను ఈ ముగ్గురు పంచుకున్నారు. గోదాముకు రాకుండానే మాయమైన 10 లారీల ధాన్యం.. ఇంకా పెద్ద ఎత్తున జరిగిన మరో మోసంలో... వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యానికి సంబంధించిన నిల్వలను గోదాంలో దించకుండానే, ఆన్లైన్లో మాత్రం దించినట్లు రికార్డుల్లో తప్పుగా నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్ని నేరుగా వేములవాడకు చెందిన చేపురి మధుకర్ (A4)కు అప్పగించారు. మధుకర్ ఆ ధాన్యమును సిద్దిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి, ఆ విధంగా వచ్చిన భారీ మొత్తాన్ని నిందితులంతా పరస్పరం పంచుకున్నారు. పై మోసాలను మరియు అక్రమాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్.నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక పోలీస్ టీమ్‌ను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితుల వివరాలు - రికవరీల పట్టిక.. A1. ఉత్క్యం విజయ్ (36) మేనేజర్, పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాం విద్యానగర్, కరీంనగర్. రూ.2,85,400 నగదు స్వాధీనం; రూ.37,65,358 బ్యాంక్ ఖాతా ఫ్రీజ్... A2. కమ్మరి రాజశేఖర్ (36) మండల స్థాయి కో-ఆర్డినేటర్ (DMO ఆఫీస్) బై నగర్, సిరిసిల్ల రూ.1,50,000 నగదు స్వాధీనం... A3. గడ్డం స్వామి ఇన్-చార్జ్, రుద్రంగి ఐకేపీ కేంద్రం - దర్యాప్తులో ఉంది... A4. చేపురి మధుకర్ (40) ఓనర్, మల్లికార్జున రైస్ మిల్ సాయినగర్, వేములవాడ రూ.9,81,400 నగదు స్వాధీనం; రూ.4,68,555 బ్యాంక్ ఖాతా ఫ్రీజ్... A5. వాసాల గణేష్ (40) సూపర్వైజర్, SWC గోదాం, పెద్దూర్ అర్చనపల్లి, వేములవాడ రూరల్ రూ.8,67,711 బ్యాంక్ ఖాతా ఫ్రీజ్.. A6. గాజుల నవీన్ (31) ఇన్-చార్జ్, పీఏసీఎస్ (PACS) పద్మనగర్, బద్దెనపల్లి దర్యాప్తులో ఉంది... A7. చిటుకుల శ్రీకాంత్(45) కమిషన్ ఏజెంట్ (వ్యాపారం) మోహినిపుర స్ట్రీట్, సిద్దిపేట దర్యాప్తులో ఉంది... పోలీసుల హెచ్చరిక: ప్రస్తుతం నిందితులు A1 ఉత్క్యం విజయ్, A2 కమ్మరి రాజశేఖర్, A4 చేపురి మధుకర్, A5 వాసాల గణేష్, A6 గాజుల నవీన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ పత్రాలు సృష్టించి, ధాన్యమును అక్రమంగా విక్రయిస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.