రాజన్న సిరిసిల్ల జిల్లా: పదిర వాగులో ఇసుక మాఫియా కలకలం.. బోల్తా పడిన ట్రాక్టర్, నలుగురిపై కేసు!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ ఇసుక రవాణా గుట్టు రట్టు.. నలుగురిపై కేసు నమోదు
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్సై ఎన్. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీ రాత్రి వేళ మండలంలోని పదిర వాగు నుంచి నాలుగు ట్రాక్టర్లలో కొందరు ఎలాంటి పర్మిట్లు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఒక ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో భాగంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను 'ప్రెస్' (PRESS) స్టిక్కర్ ఉన్న కారులో ఇద్దరు వ్యక్తులు అనుసరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపునకు పాల్పడిన పదిర గ్రామానికి చెందిన సుధాకర్, తిరుపతి, రాజన్నపేటకు చెందిన నర్సింలు, బొప్పాపూర్ వాసి కుమార్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. ట్రాక్టర్ల వెనుక 'ప్రెస్' కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నామని, వారిపై త్వరలోనే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.