డబ్బులు ఇవ్వలేదని సాంఘిక బహిష్కరణా? VDC పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
గౌడ కుటుంబాల బహిష్కరణ దారుణం: తిర్మాన్ పల్లి VDC పై కఠిన చర్యలు తీసుకోవాలి
– సదాశివనగర్ తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించిన గౌడ సంఘాల నాయకులు
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:సదాశివనగర్
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిర్మాన్ పల్లి గ్రామంలో కల్లు గీత కార్మిక (గౌడ) కుటుంబాలను సామాజికంగా బహిష్కరించిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (VDC) పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ కుల సంక్షేమ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సదాశివనగర్ తహసిల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగా గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సైదగౌని వెంకట్ గౌడ్, జై గౌడ జిల్లా అధ్యక్షుడు మురళి గౌడ్ మాట్లాడుతూ... తిర్మాన్ పల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం గౌడ కులస్థుల నుంచి గ్రామ కమిటీ అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసిందని తెలిపారు. ఆ డబ్బులు ఇచ్చేందుకు గీత కార్మికులు నిరాకరించడంతో ఆగ్రహించిన VDC, వారి కుటుంబాలపై సాంఘిక బహిష్కరణ విధించిందని ఆరోపించారు. గ్రామంలో గౌడ కులస్తులతో ఎవరూ మాట్లాడకూడదని, వారికి ఎలాంటి నిత్యావసర వస్తువులు లేదా సరుకులు విక్రయించకూడదని, ఒకవేళ ఎవరు మాట్లాడినా లేదా వస్తువులు ఇచ్చినా రూ. 5,000 జరిమానా విధిస్తామని గ్రామంలో చాటింపు వేయించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. రాజ్యాంగానికి, ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా గ్రామంలో సమాంతర పాలన సాగిస్తున్న VDC బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు కూడా వినతిపత్రాలు అందజేస్తామని నాయకులు తెలిపారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకుడు రామా గౌడ్, తిర్మాన్ పల్లి గీత కార్మికులు స్వామి గౌడ్, మైసాగౌడ్, మల్లా గౌడ్, శ్రావణ్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, చిన్న మైసా గౌడ్, మహేష్ గౌడ్, బాలా గౌడ్, మండల గౌడ సంఘం నాయకులు సాయి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.